Dari
PERFORMING ARTISTS
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
Producer
Lirik
భగవద్గీత...11వ అధ్యాయం....విశ్వరూప దర్శన యోగము...
1. అర్జునుడు పలికెను: నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత,
నా మోహము ఇప్పుడు తొలగిపోయినది.
2. సర్వ ప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను, ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్య శాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను.
3. ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు, నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది, ఓ పురుషోత్తమా.
4. ఓ యోగేశ్వరా, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే, దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన
విశ్వ రూపమును నాకు చూపించుము.
5. శ్రీ భగవానుడు ఇలా పలికెను: వివిధములైన ఆకృతులు, పరిమాణములు, మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము ఓ పార్థ.
6. నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, పన్నెండుగురు అదితి పుత్రులను, ఎనిమిది మంది వసువులను,
పదకొండు రుద్రులను, ఇద్దరు అశ్వినీ కుమారులను, అంతే కాక, నలభైతొమ్మిది మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము.
7. ఒక్కచోటే కూడిఉన్న సమస్త చరాచరములను కలిగిఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము ఇప్పుడు
ఓ అర్జునా. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే తిలకించుము.
8. కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను.
నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము.
9. సంజయుడు పలికెను: ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను.
10-11. ఆ యొక్క విశ్వరూపములో, అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు.
12. ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు.
13. అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు.
14. అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబొడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడుని ఈ విధంగా స్తుతించాడు.
15. అర్జునుడు ఇలా చెప్పెను, ఓ శ్రీ కృష్ణా, నీ దేహము యందు నేను సకల దేవతలనూ, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మ దేవుడిని, శివుడిని, అందరు ఋషులను, మరియు దివ్య సర్పములను చూస్తున్నాను.
16. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో, మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వరా, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆదిమధ్యాంతరములు చూడలేకున్నాను.
17. కిరీటముతో, చక్ర-గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది.
18. నీవే అనశ్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు.
19. నీవు ఆది-మధ్య-అంతము లేనివాడవు నీ శక్తి అపరిమితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు సూర్యచంద్రులు
నీ నేత్రముల వంటివి మరియు అగ్ని నీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి నిన్ను, నేను దర్శిస్తున్నాను.
20. దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ, ముల్లోకములూ భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను.
21. దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు.
22. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు.
23. ఓ మహాప్రభూ, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు, మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న
నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో, సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితలమై ఉన్నాము.
24. హే విష్ణో! ఆకాశమును తాకుతూ, ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిఉన్న నోర్లతో, విశాలమైన అగ్ని గుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు, భయముతో గుండె అదిరిపోతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను.
25. ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను, చూసిన పిదప, నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము దయచేసి నామీద కృప చూపుము.
26-27. ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను.
28-29. ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్పగొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్ల లోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపోతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు.
30. నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కులా ఎన్నెన్నో ప్రాణులను గ్రసించివేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్ళతో వారిని కబళించి వేస్తున్నావు. హే విష్ణో! నీవు సమస్త జగత్తును నీయొక్క భయంకరమైన, సర్వ వ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు.
31. నీవెవరో తెలియచేయుము ఓ భయంకర రూపము కలవాడా. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికీ ముందే ఉన్న నీ గురించి, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను, ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను.
32. శ్రీ భగవానుడు ఇలా పలికెను : నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును.
నీ యొక్క ప్రమేయం లేకున్ననూ, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు.
33. కాబట్టి, ఓ సవ్యసాచీ, లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నా చే సంహరింపబడి ఉన్నారు, కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు.
34. ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఇంతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి, వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము, నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు.
35. సంజయుడు పలికెను : కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి,
శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను.
36. అర్జునుడు పలికెను : ఇంద్రియములకు అధిపతి హే హృషీకేశా, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు.
37. ఓ మహాత్మా, మూల సృష్టికర్తయైన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు?
ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభూ, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త-అవ్యక్తములకూ అతీతమైన అక్షరుడవు.
38. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకే ఒక్క ఆధారము, ఆశ్రయము.
నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామము. ఓ అనంతరూపా, నీవే సమస్త జగత్తుయందు వ్యాపించి ఉన్నవాడవు.
39. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వ భూతముల ప్ర-పితామహుడవు. నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను!
40. అనంతమైన శక్తిసామర్థ్యములు కల ప్రభూ, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను, నిజానికి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగినవాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు, అందుకే సమస్తమూ నీ స్వరూపమే.
41-42. నీవు నా సఖుడవు అనుకుంటూ, అతి చనువుతో నిన్ను, ఓ కృష్ణా', ఓ యాదవా', ఓ నా ప్రియ మిత్రమా' అని పిలిచాను.
నీ మహత్త్వము తెలియక, నిర్లక్ష్యముగా, అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను.
43. నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్ఠమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు, నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు?
44. అందుకే ఓ ప్రభూ, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ, నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా, మరియు ప్రేమించినవారిని ప్రేమికులు మన్నించినట్టుగా, దయచేసి నా అపరాధములను మన్నింపుము.
45. ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే, నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము, ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా.
46. ఓ వెయ్యి చేతులు కలవాడా, నీవే మూర్తీభవించిన జగత్తుయైనా, కిరీటము ధరించి, చక్రమును, గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను.
47. శ్రీ భగవానుడు పలికెను: అర్జునా, నీ చేత ప్రసన్నుడనై, నా యోగమాయా శక్తి ద్వారా, నా యొక్క తేజోవంతమయిన, అనంతమైన, మరియు సనాతనమైన మూల విశ్వ రూపమును నేను నీకు చూపించితిని. నీ కంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు.
48. వేదముల అధ్యయనం వలన కానీ, యజ్ఞయాగాదులు చేయటం వలన కానీ, తపస్సులు, దానాల వలన కానీ, తీవ్ర నియమ-నిష్ఠలను ఆచరించటం వలన కానీ, ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటివరకు చూడలేదు, ఓ కురు యోధ శ్రేష్ఠుడా.
49. నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్నచిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము.
50. సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క చతుర్భుజ సాకార రూపమును మరల చూపించెను. తదుపరి, సౌమ్యమైన రెండు భుజముల రూపమును స్వీకరించి, భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను.
51. అర్జునుడు ఇలా అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీ యొక్క సౌమ్యమైన రెండు చేతుల మనుష్య రూపము చూసి, నా ప్రశాంతతను మళ్ళీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది.
52-53. శ్రీ భగవానుడు పలికెను: నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమయినది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కానీ, తపస్సులవలన కానీ, దానధర్మాల వలన కానీ, లేదా యజ్ఞముల వలన కానీ, నేను, నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను.
52. ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్థముగా తెలుసుకోబడుతాను.
ఓ పరంతపా, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.
53. ఎవరైతే అన్ని కర్మలనూ నా కొరకే చేస్తారో, నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వ భూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
విశ్వరూప దర్శన యోగము అను 11వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda

