뮤직 비디오

뮤직 비디오

크레딧

실연 아티스트
R. P. Patnaik
R. P. Patnaik
리드 보컬
작곡 및 작사
Swami Mukundananda
Swami Mukundananda
작사가 겸 작곡가
프로덕션 및 엔지니어링
R. P. Patnaik
R. P. Patnaik
프로듀서

가사

భగవద్గీత...4వ అధ్యాయము...జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
1. పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.
2. ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో క్షీణించి పోయినది.
3. అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన, ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను.
ఎందుకంటే, నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.
4. అర్జునుడు ఇలా అన్నాడు : నీవు వివస్వానుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
5. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి, ఓ అర్జునా. నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా
నేను పుట్టుకలేని వాడిని అయిఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా,
 నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను.
6. ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.
7. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను
ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.
8. నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు, వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు.
9. మమకారాసక్తి, భయము, మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి,
ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు, మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు.
10. నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, ఓ పృథ తనయుడా అర్జునా.
11. ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి.
12. జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.
13. కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈవిధంగా తెలుసుకుందురో,
వారు కర్మ బంధములలో చిక్కుకోరు.
14. ఈ సత్యమును తెలుసుకొని, ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా, తమ కర్మలను ఆచరించారు. కాబట్టి, ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ, నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.
15. కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను, దీనిని తెలుసుకోవటం ద్వారా, నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు.
16. కర్మ, వికర్మ, మరియు అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యదార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.
17. ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు.
వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు.
18. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేసారో అట్టివారు, జ్ఞానోదయమైన మునులచే, పండితులు అనబడుతారు.
19. ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు-విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా, వారు ఏమి చేయనట్టే.
20. ఆశారహితుడై ఉండి, ఏదీ నాది అన్న భావన లేకుండా, మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవానికి, శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు.
21. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటి
జీవన ద్వంద్వములకు అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.
22. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, భగవత్ అర్పిత యజ్ఞంగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు.
23. సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.
24. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు.
25. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.
26. కొందరు, జ్ఞానముచే ప్రేరణ నొంది, తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని మరియు తమ ప్రాణ శక్తిని కూడా, నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు.
27. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు.
28. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.
29-30. మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.
31. యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి, పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు, ఈ లోకంలో గాని, పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు.
32. ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.
33. ఓ శత్రువులను లోబరుచుకొనే వాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును.
34. ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు.
35. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో, నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు.
36. పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.
37. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును.
38. ఈ లోకంలో, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ది సాధించిన తరువాత, కాల క్రమంలో ఈ జ్ఞానం, సాధకుని హృదయంలో పొందబడుతుంది.
39. గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారు మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.
40. జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు.
41. ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు.
42. కాబట్టి, జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా, కర్మ యోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము అను 4వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda
instagramSharePathic_arrow_out

Loading...