크레딧
실연 아티스트
R. P. Patnaik
리드 보컬
작곡 및 작사
Swami Mukundananda
작사가 겸 작곡가
프로덕션 및 엔지니어링
R. P. Patnaik
프로듀서
가사
భగవద్గీత...10వ అధ్యాయం...విభూతి యోగము...
1. శ్రీ భగవానుడు ఇలా పలికెను : నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము, ఓ గొప్ప బాహువులు కలవాడా. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు దాన్ని తెలియపరుస్తాను.
2. దేవతలకు గానీ, మహర్షులకు గానీ నా మూల స్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే.
3. నేను జన్మరహితుడను మరియు ఆది లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడుతారు.
4-5. బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణ, సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, భయము-ధైర్యము, అహింస, సమత్వ-బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి-అపకీర్తి మొదలగు - మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి.
6. సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు, మరియు పద్నాలుగు మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకం లోని సమస్త ప్రజలు అవతరించారు.
7. నా మహిమలను మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.
8. నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.
9. వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుంటారు.
10. మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు.
11. వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.
12-13. అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.
14. ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యదార్థ స్వరూపమును తెలుసుకోలేరు.
15. ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయినవాడా, సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే ! నిజానికి, నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.
16-17. నీవు ఏఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో, వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను, ఓ భగవంతుడా?
18. విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము, ఓ జనార్దనా. నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు.
19. శ్రీ భగవానుడు పలికెను : ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను, ఓ కురు శ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు.
20. ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము, మరియు అంత్యము.
21. అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.
22. నేను వేదములలో సామ వేదమును, దేవతలలో ఇంద్రుడను. ఇంద్రియములలో మనస్సును ప్రాణులలో చైతన్యమును.
23. రుద్రులలో నేను శంకరుడను అసురులలో కుబేరుడను వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును.
24. ఓ అర్జునా, పురోహితులలో నేను బృహస్పతిని సేనాపతులలో నేను కార్తికేయుడను మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము.
25. మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన 'ఓం' కారమును. జపములలో భగవన్నామమును మరలమరల జపించటమే నేను స్థావరములలో హిమాలయమును నేను
26. వృక్షములలో నేను రావి చెట్టును దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను, సిద్దులలో నేను కపిల మునిని.
27. గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన, ఉచ్చైఃశ్రవమును. భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును.
28. ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడైన మన్మథుడును నేనే సర్పములలో వాసుకిని నేను.
29. నాగులలో నేను అనంతుడను నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములలో నేను అర్యముడను న్యాయ-ధర్మ పాలన అందిoచే వారిలో నేను యమధర్మరాజుడను.
30. దైత్యులలో నేను ప్రహ్లాదుడను అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము.
31. పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును, మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.
32. ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య, మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే.
33. అక్షరములలో అ-కారమును సమాసములలో ద్వంద్వ సమాసమును. నేనే అపరిమితమైన కాలమును, మరియు సృష్టికర్తలలో బ్రహ్మను.
34. సర్వమునూ కబళించే మృత్యువును నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరిసంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపకశక్తిని, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమును.
35. సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే.
హైందవ పంచాంగంలో మార్గశిర మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును.
36. మోసగాళ్ళలో జూదమును నేను తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢసంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే.
37. వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడను అని తెలుసుకొనుము మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.
38. న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానులలో జ్ఞానమును నేనే.
39. సర్వ భూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే, అర్జునా. చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు.
40. నా దివ్య విభూతులకు అంతము లేదు, ఓ పరంతపా. నేను ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే.
41. నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే, అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము.
42. ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే, సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
విభూతి యోగము అను 10వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda