크레딧
실연 아티스트
R. P. Patnaik
리드 보컬
작곡 및 작사
Swami Mukundananda
작사가 겸 작곡가
프로덕션 및 엔지니어링
R. P. Patnaik
프로듀서
가사
భగవద్గీత...15వ అధ్యాయం...పురుషోత్తమ యోగము...
1. శ్రీ భగవానుడు పలికెను : వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.
2. త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి.
క్రిందిన, దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.
3-4. ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు, దాని యొక్క మొదలు, చివర, లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.
5. దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి
ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.
6. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.
7. భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.
8. ఎలాగైతే గాలి, సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీస్కువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి,
కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.
9. మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు - చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు - వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.
10. అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు.
11. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.
12. సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.
13. పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.
14. నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.
15. నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు మర్చిపోవుట కలుగుతున్నాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే.
16. సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి, క్షరములు అనగా నశించేవి మరియు అక్షరములు అనగా నశించనివి.
భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు.
17. ఇవే కాక, నాశరహితమైన పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు.
18. నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థముకంటేనూ, మరియు నాశరహితమైన జీవాత్మ కంటేనూ కూడా అతీతమైనవాడను.
కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.
19. ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు.
ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.
20. ఓ పాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
పురుషోత్తమ యోగము అను 15వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda