Créditos
PERFORMING ARTISTS
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
Producer
Letra
భగవద్గీత...5వ అధ్యాయము...కర్మ, సన్న్యాస యోగము
1. అర్జునుడు అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మ యోగమును కూడా చేయమన్నావు.
ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?
2. భగవానుడు పలికెను: కర్మ సన్యాస మార్గము మరియు కర్మ యోగ మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి.
కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.
3. దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు.
4. అజ్ఞానులు మాత్రమే కర్మ సన్యాసము మరియు కర్మ యోగము భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.
5. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము మరియు కర్మ యోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు.
6. భక్తి యుక్తముగా పని చేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము. కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును.
7. పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు.
8-9. కర్మ యోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు - చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, విసర్జిస్తున్నప్పుడూ, స్వీకరిస్తున్నప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ చేసేది నేను కాదు' అన్ని ఎల్లప్పుడూ భావింతురు.
ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.
10. సమస్త మమకారాసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు, తామరాకు నీటిచే తడి అవ్వనట్టు, పాపముచే తాకబడరు.
11. యోగులు, మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.
12. అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి, కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో, తమ కోరికలచే ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనం కోసం పని చేసే వారు, కర్మ బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.
13. ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.
14. కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును.
15. సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనవుతున్నారు.
16. కానీ, ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు, వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును.
17. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.
18. నిజమైన పండితుడు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని
సమదృష్టితో చూస్తారు.
19. సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.
20. భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగినా లభిoచినా పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగినా క్రుంగిపోరు.
21. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు, ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు.
22. ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.
23. ఈ శరీరమును విడిచి పెట్టక ముందే ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు.
24. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు, భగవంతునితో ఏకమై, భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు.
25. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమౌతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు.
26. నిరంతర ప్రయాస ద్వారా కామ-క్రోధముల నుండి బయట పడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మ-జ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహ పర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది.
27-28. అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి, దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రములలో లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి, కామ-క్రోధ-భయ రహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును.
29. సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందును.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
కర్మ,సన్న్యాస యోగము అను 5వ అధ్యాయము.
భగవద్గీత...5వ అధ్యాయము...కర్మ, సన్న్యాస యోగము సమాప్తము
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda