Créditos

PERFORMING ARTISTS
R. P. Patnaik
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
R. P. Patnaik
Producer

Letra

భగవద్గీత... 9వ అధ్యాయం...రాజ విద్య, రాజ గుహ్యా యోగము...
1. శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతికసంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు.
2. ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.
3. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు, ఓ శత్రువులను జయించేవాడా.
వారు పదేపదే జనన-మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.
4. ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను.
5. అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము! నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను మరియు నిర్వాహకుడను అయినా, నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను.
6. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా, ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా, సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి.
7-8. ఒక కల్పము చివరన, సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను.
9. ఓ సిరి-సంపదలను జయించే వాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా,
ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను.
10. నా యొక్క నిర్దేశంలో పని చేస్తూ, ఈ భౌతిక శక్తి, సమస్త చరాచర భూతములను జనింపచేయును, ఓ కుంతీ పుత్రుడా.
ఈ కారణం వలన, సృష్టి, స్థితి, మరియు లయములు కలిగిన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును.
11. నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.
12. భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసుర, నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి, వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది.
13. కానీ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థా, నన్నే, శ్రీ కృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది-మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నంచేసి వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.
14. ఎల్లప్పుడూ నా దివ్య లీలలను మహిమలను గానం చేస్తూ, దృఢ-సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.
15. మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.
16-17. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును, మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను, మరియు నేనే వేద మంత్రమును. నేనే ఆజ్యము నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి, నేనే తండ్రిని జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడుని కూడా నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును, మరియు యజుర్వేదమును నేనే.
18. నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామిని, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము నేనే శాశ్వతస్థానమును మరియు సనాతన బీజమును.
19. నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను, మరియు నేనే వర్షమును అవుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా.
20. వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గుచూపేవారు, నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞ శేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి, పవిత్రులైన వీరు, స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు.
వారి పుణ్య కర్మల ఫలంగా, వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు, మరియు, దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు.
21. స్వర్గ లోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదేపదే వచ్చి పోతుంటారు.
22. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.
23. ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు. కానీ, అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు.
24. సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే.
25. దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.
26. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల
నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.
27. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.
28. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు.
29. నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.
30. పరమ పాపిష్ఠివారు అయినా సరే, నన్ను అనన్య భక్తితో పూజిస్తే, వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.
31. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.
32. వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణుజొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు.
33. ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి, తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచం లోకి వచ్చాక, ఇక, నా యందు భక్తి తో నిమగ్నమవ్వుము.
34. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
రాజ విద్య, రాజ గుహ్యా యోగము అను 9వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
                                                                      ***
Written by: Swami Mukundananda
instagramSharePathic_arrow_out

Loading...