Créditos

PERFORMING ARTISTS
R. P. Patnaik
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
R. P. Patnaik
Producer

Letra

భగవద్గీత...13వ అధ్యాయం...క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము...
1. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కేశవా, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి? అని కూడా తెలుసుకోగోరుచున్నాను.'
2. సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను: ఓ అర్జునా, ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది.
3. ఓ భరత వంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎఱింగిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమని మరియు ఆత్మ, పరమాత్మ క్షేత్రజ్ఞులని తెలుసుకోవటమే, నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను.
4. వినుము, క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.
5. మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కు విధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.
6. పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు కలిసిన పదకొండు ఇంద్రియములు, మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది.
7. వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడుతాయి.
8-12. నమ్రత కృత్రిమ బుద్ధి లేకుండా ఉండుట అహింస క్షమా గుణము సరళత గురు సేవ శరీర-మనస్సుల పరిశుద్ధత నిశ్చల బుద్ధి ఆత్మ-నిగ్రహము ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి అహంకారము లేకుండుట జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం మమకారరాహిత్యం భార్య, పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని యావ లేకుండా ఉండుట జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను.
13. ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్.
14. సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.
15. ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.
16. ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైన వాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు.
17. ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే,
సమస్త ప్రాణులకు సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.
18. అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే, మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు.
19. ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును,
నేను నీకు తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.
20. భౌతికమైన ప్రకృతి మరియు ఆత్మ సంబంధమైన పురుషుడు రెండూ కూడా అనాదియైనవి సనాతనమైనవి. శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.
21. సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.
22. ఎప్పుడైతే భౌతిక శక్తి అయిన ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ అయిన పురుషుడు త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.
23. దేహముయందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు.
24. పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్థమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు.
25. కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.
26. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా
ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.
27. ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము.
28. సమస్త ప్రాణులలో, ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.
29. సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.
30. శరీరము యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు.
31. విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.
32. ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా,
అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.
33. ఆకాశము అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.
34. ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యము చేయును.
35. జ్ఞాన-చక్షువులచే, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అను 13వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda
instagramSharePathic_arrow_out

Loading...