Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
Producer
Lyrics
భగవద్గీత...18వ అధ్యాయము... మోక్ష సన్యాస యోగము...
1. అర్జునుడు పలికెను : ఓ మహాబాహువులు కల కృష్ణా, సన్యాసము మరియు త్యాగము ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది.
2. శ్రీ భగవానుడు ఇలా పలికెను : కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు.
సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు.
3. కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నియూ దోషభూయిష్టమైనవి అని, వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞములు, దానములు, మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు.
4. త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగము అనేది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది.
5. యజ్ఞము, దానము, మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము, మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి.
6. ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు ఓ అర్జునా.
7. విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును.
8. విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు.
9. అర్జునా, కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు.
10. నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు.
11. దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును.
12. స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా - సుఖము, దుఃఖము, మరియు ఈ రెంటి మిశ్రమము - ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ, కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు
ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు.
13. ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
14. శరీరము, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.
15-16. శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.
17. చేసేది నేనే అన్న కర్తృత్వ అహంకార భావమును విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధములకు లోనుకారు.
18. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త - ఈ మూడు కర్మ యొక్క అంగములు.
19. జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము.
20. ఏ జ్ఞానము చేతనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్త్వ గుణములో ఉంటుంది..
21. ఏ జ్ఞానము చేతనయితే, భిన్నభిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రజోగుణములో ఉన్న రాజసికమని గ్రహించుము.
22. సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది.
23. ఏదైతే కర్మ - శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో,
అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.
24. స్వార్థ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును.
25. మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వశక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.
26. అహంకార-మమకార రహితముగా ఉన్నవారు, మరియు ఉత్సాహము, దృఢసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు, సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు.
27. కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడు.
28. క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను, తమోగుణ కర్తలు అంటారు.
29. ఇక వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.
30. ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.
31. ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి, రజోగుణములో ఉన్నట్టు.
32. ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
33. యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పము మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.
34. ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము విధులు, కామము, మరియు అర్థము పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.
35. విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు.
36. ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి.
37. మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.
38. ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక సుఖము అని అంటారు.
ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది.
39. ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, మరియు నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక ఆనందము అని చెప్పబడును.
40. ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
41. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి పుట్టుక పరంగా కాదు.
42. ప్రశాంతత, ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
43. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్థ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.
44. వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు.
పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.
45. స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.
46. తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవరి నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వరిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.
47. పర ధర్మమును సరిగ్గా చేయుటకంటే కూడా, సరిగా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
48. తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
49. ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను విడిచిపెట్టారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
50. ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా,
బ్రహ్మన్ ను కూడా ఎలా పొందగలడో - వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము.
51-53. వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము ఇవేమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు.
54. పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
55. కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప,
నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.
56. సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.
57. నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతీ కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి,
నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.
58. నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ, అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.
59. ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, నేను యుద్ధం చేయను' అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత భౌతిక క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది.
60. ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు.
61. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
62. సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఓ భరతా. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.
63. ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.
64. నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానములో కెల్లా అత్యంత గోప్యమైనది.
నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
65. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
66. అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను భయపడకుము.
67. ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి, లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ముఖ్యంగా, నాపట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు.
68. ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు.
వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.
69. వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.
70. మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను ఇదే నా అభిప్రాయము.
71. శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.
72. ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?
73. అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా. నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
74. సంజయుడు పలికెను: ఈ విధంగా నేను, వాసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, పృథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
75. వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన
శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.
76. సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
77. మరియు ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, పదేపదే మహదానందముతో పదేపదే పులకించి పోతున్నాను.
78. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
మోక్ష సన్యాస యోగము అను 18వ అధ్యాయము.
ఇంతటితో 700 శ్లోకములు కలిగిన 18 అధ్యాయములు సంపూర్ణ భగవద్గీత తాత్పర్యము సమాప్తము...
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
కృష్ణం వందే జగద్గురం...
ఓం శాంతి శాంతి శాంతి: ...
***
Written by: Swami Mukundananda