Credits

PERFORMING ARTISTS
R. P. Patnaik
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
R. P. Patnaik
Producer

Lyrics

భగవద్గీత... 7 వ అధ్యాయం...జ్ఞాన, విజ్ఞాన యోగము...
1. భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.
2. ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.
3. వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.
4. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.
5. ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి అనగా ఆత్మ శక్తి, అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.
6. సమస్త జీవ రాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తిస్థానము మరియు నా లోనికే ఇది అంతా లయమై పోతుంది.
7. నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.
8. నీటి యందు రుచిని నేను, ఓ కుంతీ పుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారమును అనగా ప్రణవమును. ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును.
9. భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే.
10. ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.
11. భరత వంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధముకాని, శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే.
12. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్త్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను.
13. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై , ఈ లోకంలోని జనులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు.
14. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.
15. నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు జ్ఞానము లేని వారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైనవారు, మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు.
16. ఓ భరతశ్రేష్ఠుడా, నాలుగు రకముల భక్తి-పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమౌతారు ఆపదలో ఉన్నవారు,
జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.
17. వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు.
18. నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో ఉండి, దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.
19. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.
20. భౌతిక ప్రాపంచిక కోరికలచేత జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు.
21. భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.
22. శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ, నిజానికి
ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే.
23. కానీ ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు, అదే సమయంలో, నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు.
24. పరమేశ్వరుడైన నన్ను, శ్రీ కృష్ణుడిని, ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని, అల్ప జ్ఞానము కలిగినవారు అనుకుంటారు. అక్షరమైన, సర్వోత్కృష్టమైన ఈ నాయొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు.
25. నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పుచెందని వాడినని తెలుసుకోలేరు.
26. అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను.
27. ఓ భరత వంశస్థుడా, రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహము, భ్రాంతి నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతీ ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది.
28. పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు.
29. ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మంను,
తమ ఆత్మ తత్త్వమును, సమస్త కర్మ క్షేత్రమును తెలుసుకుంటారు.
30. సమస్త పదార్థ క్షేత్రమైన అధిభూత, దేవతలైన అధిదైవ, మరియు యజ్ఞములకు ఈశ్వరుడైన అధియజ్ఞము లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
జ్ఞాన, విజ్ఞాన యోగము అను 7వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda
instagramSharePathic_arrow_out

Loading...