クレジット
PERFORMING ARTISTS
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Swami Mukundananda
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
Producer
歌詞
భగవద్గీత...12వ అధ్యాయం...భక్తి యోగము...
1. అర్జునుడు ఇలా అడిగెను: నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ ను ఉపాసించే వారు వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు?
2. శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను.
3-4. నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ, మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్త్వాన్ని - ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.
5. మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.
6-7. కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది.
8. నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు.
9. ఒకవేళ నీవు మనస్సును నా యందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జునా, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ, నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము.
10. నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు.
11. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము.
12. యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమయినది. ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మెరుగైనది, ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును.
13-14. ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ధనముపై ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా,
సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.
15. లోకమున ఎవ్వరినీ బాధ పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
16. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా, మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
17. ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.
18-19. ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అవమానముల ఎడ, చలి-వేడిమి పట్ల,
సుఖ-దుఖఃముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు.
20. ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.
ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత లోని
భక్తి యోగము అను 12వ అధ్యాయము.
ఎక్కడైనా అక్షర దోషమైనా, భావదోషమైనా దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి
ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామీ ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.
***
Written by: Swami Mukundananda